
- మావోయిస్టు అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు పేరిట మెయిల్
- తనిఖీలు చేసి ఏమీ లేదని తేల్చిన బాంబ్, డాగ్ స్క్వాడ్
నాగర్‌కర్నూల్/మేడ్చల్ కలెక్టరేట్, వెలుగు : నాగర్‌కర్నూల్, మేడ్చల్ మల్కాజ్‌గిరి కలెక్టరేట్లను పేల్చివేస్తామని వచ్చిన మెయిల్స్ పోలీసులు, ఉద్యోగులను ఆందోళనకు గురి చేశాయి. ఐఈడీ పైప్ బాంబ్‌తో నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌ను పేల్చి వేస్తామని గురువారం ఉదయం 7.42 గంటలకు కలెక్టరేట్‌కు మెయిల్ వచ్చింది. 10 గంటలకు మెయిల్ చూసిన ఏవో చంద్రశేఖర్ వెంటనే కలెక్టర్‌కు సమాచారమిచ్చారు. కలెక్టర్ ఆదేశాల మేరకు పోలీసులకు విషయం చెప్పడంతో మధ్యాహ్నం ఒంటి గంటకు నాగర్ కర్నూల్ డీఎస్పీ శ్రీనివాస్ బాంబ్, డాగ్ స్క్వాడ్‌తో కలెక్టరేట్‌కు వచ్చి తనిఖీలు చేపట్టారు. చివరకు బాంబు లేదని తేల్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ ముప్పాల లక్ష్మణ్‌రావు పేరుతో మెయిల్ వచ్చిందన్నారు. సవుకు శంకర్ వ్యవహారంలో ప్రభుత్వ తీరు, 2జీ కేసులో సాదిఖ్ బల్వాన్ కస్టోడియల్ మృతికి నిరసనగా బాంబు పెట్టినట్టు పేర్కొన్నారన్నారు. మెయిల్ పంపిన వారిని బిలాల్ -రియాజ్‌గా చెబుతూ పరిశీలించేందుకు నక్కీరన్ ఎడిటర్ గోపాల్‌ను సంప్రదిస్తే అతడి వద్ద ఉన్న పింక్ కవర్‌లో వీడియోలు, డాక్యుమెంట్లు ఉంటాయని, ఇందులో డీఎంకే కుటుంబ ప్రమేయం గురించి ఉంటుందని ప్రస్తావించారు.
మరోవైపు మధ్యాహ్నం 3.30 గంటల వరకు మేడ్చల్‌మల్కాజ్‌గిరి కలెక్టరేట్ఖాళీ చేయకపోతే బాంబు పెట్టి పేల్చివేస్తామని కలెక్టరేట్‌కు మెయిల్ వచ్చింది. ఇది ముప్పాల లక్ష్మణ్‌రావు@ అవుట్‌లుక్.కామ్ నుంచి బిలాల్ రియాజ్ అనే వ్యక్తి పంపించినట్టు ఉంది. కలెక్టర్ గౌతమ్ డీసీపీ కోటిరెడ్డికి సమాచారం ఇవ్వడంతో పేట్ బషీరాబాద్ ఏసీపీ రాములు, శామీర్‌పేట సీఐ శ్రీనాథ్ బాంబ్, డాగ్ స్క్వాడ్‌తో వచ్చి తనిఖీలు చేసి ఏమీ లేదని తేల్చారు.